
టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 45 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2027లో ఆటగాడిగా కొనసాగడం అనుమానమేనని ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ధోనీ ఆటగాడిగా రిటైర్ అయినప్పటికీ సీఎస్కేతోనే కొనసాగవచ్చనే ప్రచారం జరుగుతోంది. మెంటార్‌గా, సలహాదారుగా లేదా సపోర్ట్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సీఎస్కేలో మార్పులు
ఇప్పటికే సీఎస్కేలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి. చాలా కాలంగా హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో ఫ్రాంచైజీ బంధం ముగిసింది. దీంతో ఐపీఎల్ 2027కి సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌ను నియమించనుంది. కొత్త కోచ్ రాకతో జట్టు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.
ధోనీ అనుభవం కీలకం
కెప్టెన్‌గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ధోనీకి జట్టు వ్యవహారాలపై అపారమైన అనుభవం ఉంది. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం, కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో ధోనీ అనుభవం సీఎస్కేకు ఉపయోగపడనుంది.
అందుకే ఆటగాడిగా కొనసాగకపోయినా.. ఫ్రాంచైజీతో ధోనీ అనుబంధం కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెంటార్‌గా ఆయన సేవలను ఉపయోగించుకోవచ్చనే చర్చ జరుగుతోంది.
వేలానికి ముందు స్పష్టత?
ఐపీఎల్ 2027 వేలానికి ముందు రిటెన్షన్స్, ట్రేడ్స్, ఆటగాళ్ల విడుదల వంటి అంశాల్లో సీఎస్కే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కొత్త కోచ్ నియామకం పూర్తయిన తర్వాత ధోనీ పాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ 2027లో ధోనీ ఆటగాడిగా కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధోనీ స్వయంగా తన నిర్ణయాన్ని ప్రకటించే వరకు దీనిపై అధికారిక స్పష్టత ఉండదు. మరోసారి మైదానంలో ‘కెప్టెన్ కూల్’ను చూడాలని సీఎస్కే అభిమానులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు.
